జన గళం బిజినెస్ & ట్రెండింగ్ డెస్క్: మానవ బలహీనతలు, భవిష్యత్తుపై ఉండే తీవ్రమైన ఆందోళనలను వ్యాపార అవకాశంగా ఎలా మలుచుకోవచ్చో నిరూపించాడు పునీత్ గుప్తా. జ్యోతిష్యంపై ఏమాత్రం విశ్వాసం లేని ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జాతకాలకు జోడించి ఏకంగా రూ.9,500 కోట్ల విలువైన యూనికార్న్ సంస్థ “ఆస్ట్రోటాక్” (Astrotalk)ను నిర్మించిన తీరు నేడు కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
నోమురా బ్యాంకులో మంచి ఉద్యోగం, ప్రేమ విఫలం, ఆ తర్వాత పెట్టిన రెండు స్టార్టప్‌లు వరుసగా మూతపడి తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయిన సమయంలో పునీత్ ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. మనుషులు తీవ్ర అయోమయంలో ఉన్నప్పుడు భవిష్యత్తుపై చిన్న ఆశ, “అంతా మంచే జరుగుతుంది” అనే ఓదార్పు కోరుకుంటారనే మానసిక విశ్లేషణే ఈ సంస్థకు పునాది అయింది. వేద జ్యోతిషం, టారో, న్యూమరాలజీ, నాడీ జ్యోతిషం వంటి విభాగాలను ఒకే గొడుగు కిందికి తెచ్చి, నేరుగా యాప్ ద్వారా 24 గంటలూ సేవలు అందించేలా రూపకల్పన చేశాడు. ఆశ్చర్యకరంగా ఈ వేదికను ఆశ్రయిస్తున్న వారిలో అత్యధికులు యువతే కావడం, అందులోనూ ప్రేమ, కెరీర్, ఉద్యోగ ఆందోళనలపైనే ఎక్కువ ప్రశ్నలు ఉండటం గమనార్హం. ఒక వ్యక్తి వ్యక్తిగత వైఫల్యం నుంచి పుట్టిన ఆలోచన.. నేడు కోట్లాది మంది భావోద్వేగాలతో ముడిపడి వేల కోట్ల వ్యాపారంగా మారింది.
మరోవైపు ఆస్ట్రోటాక్ సంపాదన విస్తృతంగా చర్చకు రావడంతో, తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియా, సెలబ్రిటీ పూజలతో నిత్యం వార్తల్లో నిలిచే వేణుస్వామి సంపాదన మరియు ఆయన ఫీజుల అంశం కూడా నెట్టింట సరికొత్త చర్చకు దారితీస్తోంది. ఆధునిక కాలంలో జ్యోతిష్యం శాస్త్రమా కాదా అనే అంశం పక్కనపెడితే.. మనుషుల ఆందోళనలను క్యాష్ చేసుకునే ఒక లాభదాయక వ్యాపార రంగంగా మారిపోయిందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
