జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: భారత స్వాతంత్ర్య సమరంలో ప్రాణాలను సైతం తృణప్రాయంగా భావించి మాతృభూమి విముక్తి కోసం సర్వస్వాన్ని ధారపోసిన మహోన్నత విప్లవ యోధుడు షహీద్ భగత్ సింగ్ గారి జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ కొలుసు పార్థసారథి గారు ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశ స్వేచ్ఛా పోరాటంలో భగత్ సింగ్ కనబరిచిన అసమాన ధైర్యసాహసాలు యావత్ భారత యువతలో నవచైతన్యాన్ని, దేశభక్తికి సరికొత్త నిర్వచనాన్ని అందించాయని కొనియాడారు. చిన్న వయసులోనే నవయవ్వనాన్ని దేశ సేవకే అంకితం చేసి, చిరునవ్వుతో ప్రాణత్యాగం చేసిన ఆ మహనీయుని అమరత్వం ప్రతి భారతీయుడి గుండెల్లో శాశ్వతంగా సజీవంగా నిలిచి ఉంటుందని పేర్కొన్నారు. ఆయన చూపిన దేశభక్తి మార్గం, త్యాగనిరతి భావితరాలకు నిరంతరం ఆదర్శప్రాయమని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు.
