రచన: జన గళం అవనిగడ్డ డెస్క్: పేదలకు సామాజిక పింఛన్ల పంపిణీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ విక్కుర్తి శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం ఉదయం అవనిగడ్డ మండలంలోని కొత్తపేట గ్రామంలో ఆయన పర్యటించి, లబ్ధిదారుల ఇళ్ల వద్దకే నేరుగా వెళ్లి ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్లను స్వయంగా అందజేశారు.
ఈ సందర్భంగా లబ్ధిదారుల యోగక్షేమాలను, స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్న విక్కుర్తి మాట్లాడుతూ.. సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. పేదరిక నిర్మూలన దిశగా ప్రతి నెలా ఒకటో తేదీనే ఠంచనుగా పింఛన్లు అందించడంతో పాటు.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, డ్వాక్రా సంఘాల బలోపేతం వంటి విప్లవాత్మక పథకాల ద్వారా మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని వివరించారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ తమ జీవనోపాధికి కొండంత ధైర్యాన్ని, భరోసాను ఇస్తోందని ఈ సందర్భంగా లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, జనసేన శ్రేణులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
