రచన: జన గళం అవనిగడ్డ డెస్క్: దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా అత్యధిక మొత్తం పింఛన్ అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ అన్నారు. గురువారం ఉదయం అవనిగడ్డలో నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు ఆయన స్వయంగా ‘ఎన్టీఆర్ భరోసా’ సామాజిక పింఛన్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదింటి పెద్ద కొడుకులా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిలుస్తున్నారని, ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే పింఛన్ మొత్తాన్ని ఒకేసారి పెంచిన ఘనత తమ ప్రభుత్వానిదేనని తెలిపారు. గత ప్రభుత్వం రూ. 1000 పింఛన్ పెంచేందుకు నాలుగేళ్ల సమయం తీసుకుంటే, చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఒకేసారి పెంచి లబ్ధిదారులకు అందించారన్నారు. మంచానికే పరిమితమైన బాధితులకు నెలకు రూ. 15 వేలు పింఛన్ అందించడం ద్వారా వారి వైద్యానికి, కుటుంబ పోషణకు కొండంత ధైర్యం కల్పించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి ఎంపీడీఓ వనజ, గ్రామ ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు, పంచాయతీ ఈఓ తోట శ్రీనివాసరావు మరియు స్థానిక సిబ్బంది పాల్గొన్నారు.
