రచన: జన గళం డెస్క్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ అద్భుత ప్రతిభ కనబరుస్తున్న నిరుపేద విద్యార్థుల్లో ఉన్నత ఆశయాలు, విజ్ఞానాన్ని పెంపొందించేందుకు రక్ష ఫౌండేషన్, రౌండ్ టేబుల్ ఇండియా సంయుక్తంగా విశేషమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. శ్రీ కృత్తివెంటి పేర్రాజు పంతులు వారి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న 10 మంది ప్రతిభావంతులైన విద్యార్థినీ విద్యార్థులను, ఇద్దరు ఉపాధ్యాయులను ప్రత్యేక విద్యా పర్యటన నిమిత్తం మధురపూడి విమానాశ్రయం నుంచి విమానంలో హైదరాబాద్‌కు తీసుకువెళ్లినట్లు రక్ష ఫౌండేషన్ చైర్మన్ తొగరు మూర్తి వెల్లడించారు.
ఉదయం 6 గంటలకు పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి తొగరు మూర్తి మాట్లాడుతూ.. తల్లిదండ్రులు పడుతున్న శ్రమను గుర్తించి, జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. రేపు మీరు చదువుకున్న బడికే ముఖ్య అతిథిగా వచ్చే స్థాయికి ఎదగాలని, అందరూ మీ ఆటోగ్రాఫ్ కోసం ఎదురుచూసేలా విజయం సాధించాలని ఆకాంక్షించారు. హైదరాబాద్‌లోని ప్రముఖ గోల్కొండ ఫైవ్ స్టార్ హోటల్‌లో బస కల్పించి, వండర్‌లా, రామోజీ ఫిలిం సిటీ, సాలార్ జంగ్ మ్యూజియంలను మొదటి రోజు చూపిస్తారని, రెండో రోజు సైన్స్ సెంటర్లు, విజ్ఞాన కేంద్రాలను సందర్శింపజేసి ప్రత్యేక మోటివేషన్ తరగతులు నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం మూడవ రోజు ఉదయం ప్రతిష్టాత్మక ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’ రైలులో విద్యార్థులను తిరిగి రాజమండ్రి తీసుకువస్తారని పేర్కొన్నారు. రౌండ్ టేబుల్ ఇండియా ప్రెసిడెంట్ అడ్డూరి గౌతమ్ వర్మ మాట్లాడుతూ.. విద్యార్థుల ఉన్నత చదువులకు, సాంకేతిక నైపుణ్యాల సాధనకు తమ వంతు సంపూర్ణ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. తమ పాఠశాల విద్యార్థులను ఈ అద్భుత యాత్రకు ఎంపిక చేసినందుకు ప్రిన్సిపాల్ జవహర్, ఉపాధ్యాయ బృందం నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
