జన గళం మచిలీపట్నం డెస్క్: కూటమి ప్రభుత్వ హయాంలో మచిలీపట్నం నియోజకవర్గం ప్రగతి పథంలో దూసుకుపోతోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. మచిలీపట్నం రూరల్ మండలంలోని సీతారాంపురంలో ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమంలో భాగంగా మంత్రి గురువారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా వృద్ధులు, దివ్యాంగులకు స్వయంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేయడంతో పాటు, నియోజకవర్గంలో తాగునీరు, డ్రైనేజీలు, రోడ్లు వంటి మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నట్లు వెల్లడించారు.
గ్రామంలో పర్యటించిన మంత్రి కొల్లు రవీంద్ర రూ. 14.70 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు, అలాగే జీఆర్‌జీ పథకం కింద మంజూరైన రూ. 44 లక్షల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం మచిలీపట్నం మూడు స్తంభాల సెంటర్‌లో జరుగుతున్న వాటర్ పైప్‌లైన్ మరమ్మత్తులు మరియు రోడ్డు అభివృద్ధి పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల నాణ్యతలో ఎలాంటి రాజీ పడకుండా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. గత ఏడాది రూ. 54 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు పూర్తి చేయగా, తాజాగా మరో రూ. 80 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామసభలో మంత్రి మాట్లాడుతూ.. సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. సీతారాంపురం గ్రామంలో 870 మంది రైతులకు రూ. 1.20 కోట్ల మేరకు అన్నదాత సుఖీభవ, 254 మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, 215 మందికి తల్లికి వందనం, 16 మందికి ఆటోడ్రైవర్ల సేవలు, 27 మందికి హార్టికల్చర్ ద్వారా ఆర్థిక సాయం అందుతోందని వివరించారు. గ్రామంలో మంచినీటి సౌకర్యం, సీసీ రోడ్లు, డ్రైనేజీలు వంటి మౌలిక వసతుల కల్పనకు రూ. 88 లక్షలు వెచ్చించినట్లు తెలిపారు.
ఇదే వేదికగా బందరు పోర్టు ప్రాజెక్ట్ విశేషాలను మంత్రి ప్రస్తావిస్తూ.. రూ. 8,000 కోట్ల భారీ పెట్టుబడితో, 10 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే బందరు పోర్టు నిర్మాణానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం లభించిందని తెలిపారు. దీనికి అనుబంధంగా మరో రూ. 10 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని, తద్వారా ఈ ప్రాంతం మరింత పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఇది మాటలు చెప్పే ప్రభుత్వం కాదని, చేతల్లో చూపించే ప్రభుత్వమని మరోసారి నిరూపిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గొర్రెపాటి గోపీచంద్, రూరల్ పార్టీ అధ్యక్షుడు కాగిత వెంకటేశ్వరరావు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Slug: machilipatnam-minister-kollu-ravindra-palle-panduga-port-development
