జన గళం గన్నవరం డెస్క్: గన్నవరం నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. గన్నవరం మండలం కొండపావులూరు గ్రామంలో గురువారం ‘పేదల సేవలో-2.0’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులైన అవ్వాతాతలకు స్వయంగా వారి ఇళ్ల వద్దే పింఛన్లను అందజేశారు. అనంతరం ప్రత్యేక గ్రామసభ నిర్వహించి గ్రామస్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఓపికగా అడిగి తెలుసుకున్నారు.
ఈ పర్యటనలో భాగంగా గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కొండపావులూరులో రూ. 36 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న వెల్‌నెస్ సెంటర్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే యార్లగడ్డ భూమిపూజ చేశారు. ఈ నిర్మాణానికి ఉదారంగా ఐదు సెంట్ల స్థలాన్ని విరాళంగా అందించిన దాత మేడవరపు రామశేషు దంపతులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. అలాగే ‘పల్లె పండుగ-3.0’ కార్యక్రమంలో భాగంగా రూ. 55 లక్షలతో కొండపావులూరు – కట్టుబడిపాలెం బీటీ రోడ్డు నిర్మాణ పనులకు, శాస్కి (SASKI) నిధులతో రూ. 1.39 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న సూరంపల్లి – రామచంద్రాపురం రహదారి నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో రోడ్లు పూర్తిగా అధ్వానంగా తయారయ్యాయని, ఓట్ల సంఖ్యతో సంబంధం లేకుండా చిన్న గ్రామాలన్నింటికీ అవసరాన్ని బట్టి నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళికలను ఎమ్మెల్యే వివరించారు. రైతులకు సాగునీటి ఇబ్బందులు తొలగించేందుకు పోలవరం – ఏలూరు కాలువ అనుసంధానానికి ప్రభుత్వం నిధులు కేటాయించిందని, ఆత్కూరు వద్ద హైలెవెల్ వంతెన నిర్మాణానికి రూ. 20.50 కోట్లు మంజూరయ్యాయని వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో గన్నవరం అభివృద్ధికి రూ. 100 కోట్లు కేటాయించారని తెలిపారు. హెచ్‌సీఎల్ (HCL) సంస్థ సహకారంతో ఇంజినీరింగ్ విద్యార్థులకు కృత్రిమ మేధస్సు (AI)పై ఉచిత శిక్షణ అందిస్తున్నామని, నియోజకవర్గంలో పారిశ్రామిక, ఉపాధి అవకాశాలను వేగంగా విస్తరిస్తున్నామని పేర్కొన్నారు. గన్నవరం పట్టణంలో రహదారుల విస్తరణ పనులు ప్రజల సహకారంతో సజావుగా సాగుతున్నాయని, తాగునీటి సమస్యలు మరియు ఇతర దీర్ఘకాలిక సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు మరియు అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Slug: gannavaram-kondapavuluru-pedala-sevalo-mla-yarlagadda-venkatrao-development-works
