రచన: జన గళం బంటుమిల్లి డెస్క్: కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలంలో అధికార తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ విమర్శలు పోలీసు స్టేషన్ మెట్లెక్కాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక దళిత మహిళపై టీడీపీ బంటుమిల్లి మండల అధ్యక్షుడు కూనపురెడ్డి వీరబాబు తీవ్ర ఆరోపణలు చేశారంటూ వైసీపీ శ్రేణులు, స్థానిక దళిత సంఘాల ప్రతినిధులు శనివారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా, తప్పుడు ఆరోపణలు చేసిన కూనపురెడ్డి వీరబాబుపై తక్షణమే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఈ మేరకు వైసీపీ మండల స్థాయి నాయకులు, దళిత సంఘాల ప్రతినిధులు భారీగా బంటుమిల్లి పోలీసు స్టేషన్‌కు తరలివచ్చారు. స్థానిక సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ) నాగరాజును కలిసి లిఖితపూర్వక ఫిర్యాదును అందజేశారు. ఒక దళిత మహిళపై ఉద్దేశపూర్వకంగా నిరాధారమైన ఆరోపణలు చేయడం అన్యాయమని, ఆమె గౌరవానికి భంగం కలిగించిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదును స్వీకరించిన ఎస్ఐ నాగరాజు ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ వివాదంతో మండల రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి రాజుకుంది.
