జన గళం ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: 1978 సెప్టెంబర్ 22న ప్రారంభమైన తన సినీ ప్రయాణం నేటితో 48 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తన సినీ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు.
48 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో పాత్రలు పోషించానని, ఎన్నో విజయాలను చూశానని, అనేక అవార్డులు, గౌరవాలు అందుకున్నానని చిరంజీవి పేర్కొన్నారు. తనపై నమ్మకంతో అవకాశాలు ఇచ్చిన ప్రతి నిర్మాతకు, తనలోని నటుడిని విభిన్న కోణాల్లో ఆవిష్కరించిన దర్శకులకు, ప్రతి సినిమా వెనుక అహర్నిశలు శ్రమించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
అయితే తన విజయాలు, అవార్డుల కంటే అభిమానులు తనపై చూపించిన ప్రేమే గొప్పదని చిరంజీవి పేర్కొన్నారు. తనను కుటుంబ సభ్యుడిగా భావించి ఇంతటి ప్రేమాభిమానాలను అందించిన ప్రతి అభిమానికీ ధన్యవాదాలు తెలిపారు.
“చిరంజీవి” అనేది తాను పెట్టుకున్న పేరు కాగా, అభిమానుల ప్రేమతో అది తనకు శాశ్వతమైన గుర్తింపుగా మారిందని ఆయన పేర్కొన్నారు. తనపై చూపిస్తున్న ప్రేమ, అభిమానానికి ఎప్పటికీ కృతజ్ఞుడినే అంటూ చిరంజీవి తన సందేశాన్ని ముగించారు.
