జన గళం సినిమా & సాంస్కృతిక డెస్క్: స్వచ్ఛమైన తెలుగుదనం, గ్రామీణ నేపథ్యం మరియు బలమైన కథాంశంతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న బ్లాక్‌బస్టర్ చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’ సహ నిర్మాత శ్రీ ఫణి అడపాక గారిని విశాఖపట్నం వేదికగా ఘనంగా సత్కరించారు. ప్రతిష్టాత్మక జాతీయ చలనచిత్ర అవార్డుల్లో (నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్) ఉత్తమ తెలుగు చిత్రం, ఉత్తమ మేకప్ విభాగాల్లో ఈ చిత్రం జాతీయ స్థాయి గుర్తింపు సాధించిన సందర్భంగా ఈ అభినందన సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. మట్టి పరిమళం ఉన్న కథతో రూపొందిన ‘కమిటీ కుర్రోళ్లు’ జాతీయ స్థాయిలో అవార్డులు సాధించి తెలుగు సినిమా ఖ్యాతిని మరోసారి ఇనుమడింపజేసిందని, ఇది యావత్ తెలుగు చిత్ర పరిశ్రమకే గర్వకారణమని కొనియాడారు. కంటెంట్ ఉన్న చిత్రాలను నిర్మించి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన సహ నిర్మాత ఫణి అడపాక గారి కృషిని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఫణి అడపాకతో పాటు చిత్ర యూనిట్ భవిష్యత్తులో మరిన్ని గొప్ప చిత్రాలను నిర్మించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ, సామాజిక ప్రముఖులు పాల్గొని ఆయనకు శాలువాలు, పూలమాలలతో ఆత్మీయ సత్కారం గావించారు.
