జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండల కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన స్వయంభూ శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి దేవస్థానం మరియు అన్నదాన ప్రభు శ్రీ అయ్యప్ప స్వామి ఆలయాల పరిధిలో మద్యం దుకాణాలను తక్షణమే నిషేధించాలని డిమాండ్ చేస్తూ స్థానిక హిందూ సమాజం ప్రతినిధులు అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులతో పాటు మండల తహసీల్దార్, స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్సైకి నేరుగా కలిసి తమ విన్నపాన్ని అందజేశారు.
కృత్తివెన్ను అయ్యప్ప స్వామి దేవస్థానం ప్రాంగణంలో త్వరలోనే ప్రతిష్టాత్మక నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి, జనవరి 8వ తేదీ వరకు సుమారు 76 నుంచి 80 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. అలాగే శతాబ్దాల చరిత్ర కలిగిన పురాతన స్వయంభూ శ్రీ నాగేశ్వర స్వామి ఆలయానికి నిత్యం వేలాది మంది భక్తులు, మహిళలు, దీక్షాపరులు వస్తుంటారు. శివాలయం నుండి అయ్యప్ప స్వామి దేవస్థానం వరకు ఉన్న పరిధిలోనే మద్యం షాపులు ఏర్పాటు చేయడం వల్ల వచ్చే భక్తులకు తీవ్ర ఆటంకాలు, భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేవాలయ పరిసరాల్లో కాకుండా దూరంగా వేరే ప్రాంతాలకు మద్యం దుకాణాలను తరలించాలని, తద్వారా పవిత్రతను మరియు ఆధ్యాత్మిక ప్రశాంతతను కాపాడాలని హిందూ సమాజం విజ్ఞప్తి చేసింది. అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టకపోతే భక్తులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
