జన గళం తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పునాదులను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా జనసేన పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడిగా (డీహెచ్) సుదీర్ఘకాలం విశేష సేవలందించిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ శ్రీ గడల శ్రీనివాసరావు గారిని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర సంస్థాగత కార్యదర్శిగా (ఆర్గనైజింగ్ సెక్రటరీ) నియమించారు. పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆమోదం మేరకు ఈ నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి.
తెలంగాణలో జనసేన పార్టీని విస్తరింపజేయడంతో పాటు యువత, పట్టభద్రులు, ఉద్యోగ వర్గాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో గడల శ్రీనివాసరావు గారి అనుభవం పార్టీకి ఎంతగానో ఉపయోగపడుతుందని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ప్రజారోగ్య రంగంలో అందించిన విశేష సేవలు, సామాజిక స్పృహ, జీఎస్ఆర్ సేవా సంస్థ ద్వారా చేపట్టిన ప్రజాహిత కార్యక్రమాలతో ప్రజల్లో ఆయనకు మంచి గుర్తింపు ఉంది. తనపై నమ్మకంతో ఇంతటి కీలక బాధ్యతను అప్పగించిన జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి గడల శ్రీనివాసరావు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నిర్మాణాన్ని వేగవంతం చేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ నియామకం పట్ల తెలంగాణ జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
