జన గళం అంబేద్కర్ కోనసీమ జిల్లా డెస్క్:
అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం గొల్లపాలెం సముద్ర తీరానికి తుఫాను ప్రభావంతో భారీ రబ్బర్ ఫెండర్ కొట్టుకొచ్చింది. సముద్రపు అలలతో తీరానికి చేరిన ఈ భారీ వస్తువును చూసిన స్థానికులు ఆసక్తి వ్యక్తం చేశారు.
సాధారణంగా నౌకాశ్రయాల్లో నౌకలు బెర్త్‌లకు చేరే సమయంలో నేరుగా తీర నిర్మాణాలను ఢీకొనకుండా రబ్బర్ ఫెండర్లను రక్షణ కవచాలుగా ఉపయోగిస్తారు. నౌకలకు, బెర్త్‌లకు మధ్య ఒత్తిడిని తగ్గించి నష్టం జరగకుండా ఇవి సహాయపడతాయి.
తుఫాను ప్రభావంతో సముద్రంలో నుంచి కొట్టుకొచ్చిన ఈ ఫెండర్ ఏ నౌకాశ్రయానికి చెందినది? ఎక్కడి నుంచి సముద్రంలోకి చేరింది? అనే విషయాలు తెలియాల్సి ఉంది. సంబంధిత అధికారులు పరిశీలిస్తే దీని మూలం, వివరాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
