జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడ ఏలూరు రోడ్డులోని ప్రజావేదిక కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన 72 బాధిత కుటుంబాలకు రూ.40 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన కూటమి నాయకులతో కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా వెనిగండ్ల రాము మాట్లాడుతూ వైద్య చికిత్సకు అయ్యే ఖర్చులు పేద, మధ్యతరగతి కుటుంబాలకు భారంగా మారుతున్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అర్హులకు ఆర్థిక సహాయం అందుతోందన్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం పొందే ప్రక్రియ సులభతరంగా మారిందని ఆయన పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్న కుటుంబాలకు అవసరమైన సమయంలో ప్రభుత్వం అండగా ఉండేలా సీఎంఆర్ఎఫ్‌తో పాటు ఎల్ఓసీ ద్వారా కూడా సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.
గుడివాడ నియోజకవర్గంలో ఇప్పటివరకు సుమారు రూ.7.50 కోట్ల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. దీనికి అదనంగా వైద్య చికిత్సకు సంబంధించిన ఎల్ఓసీలు కూడా మంజూరవుతున్నాయని చెప్పారు. పార్టీలకు అతీతంగా అర్హత ఉన్న కుటుంబాలకు ప్రభుత్వ సహాయ కార్యక్రమాలు అందేలా పనిచేస్తున్నామని ఆయన అన్నారు.
ప్రజల అవసరాలను గుర్తించి ప్రభుత్వం పలు సంక్షేమ, సహాయ కార్యక్రమాలను అమలు చేస్తోందని వెనిగండ్ల రాము పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వ సహాయం అందించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి ప్రజలు మద్దతుగా ఉండాలని ఎమ్మెల్యే కోరారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందడంతో బాధిత కుటుంబాలు ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో జనసేన గుడివాడ నియోజకవర్గ ఇన్‌చార్జి బూరగడ్డ శ్రీకాంత్‌తో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, పార్టీ అనుబంధ విభాగాల నేతలు, బాధిత కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు.
