జన గళం గూడూరు/పెడన డెస్క్: కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ పరిధిలోని గూడూరు మండలంలో స్థానిక సంస్థల సమరంలో జనసేన పార్టీ తన జోరును ప్రదర్శించింది. ముక్కోలు ప్రాదేశిక నియోజకవర్గం (ముక్కోలు, గండరం, లేళ్ళగరువు, జక్కంచర్ల, కలపటం గ్రామాలు) పరిధిలో ఎంపీటీసీ (MPTC) స్థానానికి ఎన్డీయే కూటమి బలపరిచిన జనసేన పార్టీ అధికారిక అభ్యర్థినిగా శ్రీమతి సమ్మెట లక్ష్మి శైలజ గారు గురువారం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను లాంఛనంగా సమర్పించారు.
పార్టీ ముఖ్య నేతలు, జనసైనికులు, వీర మహిళలు, కూటమి శ్రేణులతో కలిసి భారీ ప్రదర్శనగా విచ్చేసిన ఆమె నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం శ్రీమతి సమ్మెట లక్ష్మి శైలజ గారు మాట్లాడుతూ.. ఉప ముఖ్యమంత్రి, జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాలతో ముక్కోలు సెగ్మెంట్ పరిధిలోని ముక్కోలు, గండరం, లేళ్ళగరువు, జక్కంచర్ల, కలపటం గ్రామాల సమగ్ర గ్రామీణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, మహిళా సాధికారత, రైతాంగ సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ప్రజల ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. గ్రామీణ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ, తాగునీటి సమస్యల శాశ్వత పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ద్వారా ప్రత్యేక నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు.
ప్రజాసేవకు నిరంతరం అందుబాటులో ఉండేలా తనను ఆశీర్వదించి, జనసేన పార్టీ ఎన్నికల గుర్తు అయిన ‘గాజు గ్లాస్’ గుర్తుపై ఓటు వేసి రికార్డు స్థాయి మెజారిటీతో గెలిపించాలని ముక్కోలు సెగ్మెంట్ పరిధిలోని ఐదు గ్రామాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కూటమికి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు, మండల నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
