జన గళం విజయవాడ డెస్క్: విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమరంలో భాగంగా ఎన్డీయే కూటమి ప్రచారానికి నగరవ్యాప్తంగా విశేష ప్రజాదరణ లభిస్తోంది. కూటమి బలపరిచిన జనసేన పార్టీ విజయవాడ నగర మేయర్ అభ్యర్థి శ్రీ వంగవీటి రాధాకృష్ణ (రాధా) గారికి మద్దతుగా ఆయన మాతృమూర్తి, మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి వంగవీటి రత్నకుమారి గారు గురువారం ఉదయం ప్రత్యక్ష ప్రచార రంగంలోకి దిగారు. విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, సభ్యులతో ఆమె ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కళాశాల ప్రాంగణంలో వాకింగ్ పూర్తి చేసుకున్న అసోసియేషన్ సభ్యులతో కలిసి ఆమె అల్పాహార (బ్రేక్‌ఫాస్ట్) కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ సభ్యులు రత్నకుమారి గారికి ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం నగరంలో పార్కులు, వాకింగ్ ట్రాక్‌ల నిర్వహణ, పచ్చదనం పెంపు, కాలుష్య నియంత్రణ, సీనియర్ సిటిజన్లకు అవసరమైన మౌలిక వసతులపై సభ్యులతో ఆమె విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా రత్నకుమారి గారు మాట్లాడుతూ.. స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారి ఆశయాల సాధన కోసం, బెజవాడ ప్రజల సంక్షేమం కోసం తమ కుటుంబం నిరంతరం కట్టుబడి పనిచేస్తుందని గుర్తుచేశారు. నగర అభివృద్ధిని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గార్ల నాయకత్వంలో కూటమి బలపరిచిన మేయర్ అభ్యర్థిగా బరిలో ఉన్న తన కుమారుడు వంగవీటి రాధాకృష్ణను నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు.
నగరవాసుల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం ఆధునిక ఓపెన్ జిమ్‌లు, సురక్షితమైన వాకింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేయడమే కాకుండా, నగరపాలక సంస్థను అవినీతి రహితంగా తీర్చిదిద్దే బాధ్యతను రాధా తీసుకుంటారని రత్నకుమారి గారు హామీ ఇచ్చారు. విజయవాడ భవిష్యత్తు కోసం జనసేన పార్టీ ఎన్నికల గుర్తు అయిన ‘గాజు గ్లాస్’ గుర్తుపై ఓటు వేసి వంగవీటి రాధాకృష్ణ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని వాకర్స్ అసోసియేషన్ సభ్యులకు ఆమె విజ్ఞప్తి చేశారు.
