జన గళం ఆత్మకూరు/నంద్యాల డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ పకడ్బందీగా అమలులో ఉన్న వేళ నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో భారీ ఎత్తున లెక్కల్లో చూపని నగదు పట్టుబడటం తీవ్ర కలకలం రేపింది. ఆత్మకూరుకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి భీమిశెట్టి నివాసంలో పోలీసులు గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఎలాంటి సరైన పత్రాలు లేదా ఆధారాలు లేని సుమారు రూ. 42.20 లక్షల నగదును అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
ఎన్నికల కోడ్ నిబంధనల ప్రకారం ఇంత పెద్ద మొత్తంలో నగదును నిల్వ ఉంచడంపై పోలీసులు వ్యాపారిని వివరణ కోరగా, ఆ నగదుకు సంబంధించి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు చూపించలేకపోయారు. దీంతో పోలీసులు ఆ మొత్తాన్ని అధికారికంగా సీజ్ చేశారు. ఈ నగదు ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టడానికి నిల్వ చేశారా? లేక వ్యాపార లావాదేవీలకు సంబంధించినదా? అనే కోణంలో పోలీసులు విస్తృత విచారణ చేపట్టారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ నివేదికను రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC)తో పాటు ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులకు అందజేయనున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎవరూ నిబంధనలకు విరుద్ధంగా సరైన ఆధారాలు లేకుండా నగదును తరలించినా, నిల్వ ఉంచినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
