జన గళం కృష్ణా డెస్క్: అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాల్లోని ప్రతి చెరువును మంచినీటితో నింపాలని కృత్తివెన్ను మండల పరిషత్ అధ్యక్షుడు కూనసాని గరుడ ప్రసాద్ సూచించారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఎంపీపీ పేర్కొన్నారు. గ్రామాల్లో మంచినీటి అవసరాలు, చెరువుల పరిస్థితిపై సమావేశంలో చర్చించారు.
నీటి సరఫరాకు సంబంధించిన సమస్యలను అధికారులు ఆయన దృష్టికి తీసుకురాగా, నీటిపారుదల, గ్రామీణ నీటి సరఫరా విభాగాల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేసి చెరువులను నీటితో నింపాలని సూచించారు. తాగునీటి సమస్యపై నిర్లక్ష్యం వహిస్తే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు.
ప్రస్తుత మండల పరిషత్‌కు ఇదే చివరి సర్వసభ్య సమావేశం కావడంతో ఎంపీపీ దంపతులు, జడ్పీటీసీ దంపతులు, సభ్యులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు మైలా రత్నకుమారి, ఎంపీడీవో నరసింహారావు, మాజీ ఆర్టీసీ ప్రాంతీయ చైర్మన్ పిన్నింటి మహేష్, కూనసాని సుగుణ కుమార్, పాశం కృష్ణ, మైలా రాజు, గోపీశెట్టి చిన్నా, ఎంపీటీసీ సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
