జన గళం విజయవాడ డెస్క్: దేవి శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు (ఎంపీ) శ్రీ వల్లభనేని బాలశౌరి గారు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న ఎంపీ గారికి ఆలయ అధికారులు, వేద పండితులు పూర్ణకుంభంతో సాదర స్వాగతం పలికారు.
అనంతరం అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఆశీర్వచన మండపంలో వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించగా, అధికారులు అమ్మవారి శేషవస్త్రాలు, చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ వల్లభనేని బాలశౌరి గారు మాట్లాడుతూ.. దుర్గమ్మ తల్లి కృపాకటాక్షాలతో మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలంతా సకల శుభాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలతో తులతూగాలని మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అభివృద్ధి పాలన మరింత ముందుకు సాగాలని, ప్రజల జీవితాల్లో సుఖశాంతులు వెల్లివిరియాలని కోరుకుంటూ అందరికీ దసరా, విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
