జన గళం సినిమా & ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: ప్రతిష్టాత్మక జాతీయ చలనచిత్ర పురస్కారం (నేషనల్ అవార్డ్) దక్కించుకున్న ఆనందకర క్షణాల్లో చిత్ర యూనిట్ సభ్యులు సామాజిక మాధ్యమాల వేదికగా తమ హృదయపూర్వక భావోద్వేగాలను పంచుకున్నారు. జీవితంలో ఎన్నో మరపురాని క్షణాలు ఉంటాయని, అయితే జాతీయ అవార్డును అందుకోవడం వాటన్నింటికంటే అత్యున్నత శిఖరమని పేర్కొంటూ సినిమా ప్రయాణాన్ని నెమరువేసుకున్నారు.
సాధారణంగా ఏదో నాలుగు మాటలు రాయడం వచ్చు కదా అని కవితలు రాసుకుంటూ, ‘వాస్తవికం’ అనే పుస్తకం రాసిన తనకు సినిమాకు రాసే సామర్థ్యం ఉందని నమ్మి ప్రోత్సహించిన దర్శకుడు యదు వంశీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా చెప్పులు లేకపోయినా కాళ్లు అరిగేలా తిరుగుతూ, సినిమానే ప్రపంచంగా బతుకుతూ తమ అందరినీ వెన్నంటి నడిపించి ఈ స్థాయికి చేర్చిన దర్శకుడి కృషిని కొనియాడారు. ఇంతమంది ప్రతిభను నమ్మి ప్రాజెక్ట్‌ను వెండితెరపైకి తీసుకొచ్చిన ఫణి అడపాకకు, అలాగే ఎల్లప్పుడూ అండగా నిలిచిన నిర్మాత నిహారిక కొణిదెలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. తమ ప్రయాణాన్ని నమ్మి, తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఈ అవార్డును అంకితం ఇస్తున్నట్లు భావోద్వేగంగా వెల్లడించారు.
