జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులను సమరోత్సాహంతో సిద్ధం చేశారు. “నేను ఇచ్చేవాడినే కానీ తీసుకోవడం నాకు తెలియదు.. దానం చేయడమే నాకు తెలుసు. గుండె కవాటాలు తెరిచి ఇవ్వడమే తప్ప ఎన్నడూ చేయి చాచి అడగను” అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనకు 15 శాతం సీట్లు అంటూ మాట్లాడటం చెప్పిన వాళ్ల పరిధిలోని అంశం కాదని కుండబద్దలు కొట్టారు. సార్వత్రిక ఎన్నికల సమీకరణాలు వేరు, స్థానిక సంస్థల ఎన్నికలు వేరని స్పష్టం చేశారు. పార్టీ బలంగా ఉన్న ప్రతిచోటా జనసేన కచ్చితంగా పోటీ చేస్తుందని, తద్వారా పార్టీని మరింత బలోపేతం చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని శ్రేణులకు స్పష్టం చేశారు.
ప్రతి చిన్న విషయానికి, సమస్యకు పవన్ కళ్యాణ్ కావాలంటే కుదరదని, ఎవరి స్థాయిలో స్థానిక సమస్యలను వాళ్లే పరిష్కరించుకోవాలని నేతలకు హితవు పలికారు. పంచాయతీ స్థాయిలో తలెత్తే సమస్యను స్థానిక సర్పంచ్ మాత్రమే పరిష్కరించగలరని గుర్తుచేశారు. “నా వెంట తిరగడం కాదు.. క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లి తిరగండి” అంటూ నాయకులకు దిశానిర్దేశం చేశారు. కూటమిలో భాగంగా అవసరమైతే మైత్రీపూర్వక పోటీ (ఫ్రెండ్లీ కాంటెస్ట్) కూడా చేద్దామని పేర్కొన్నారు. కాకినాడ పార్లమెంట్ పరిధిలో 32 మందితో కమిటీ నియమించినట్లే, రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన కమిటీలను కూడా వేగంగా పూర్తి చేస్తామని తెలిపారు. పార్టీ బలాబలాల అధ్యయనానికి రెండు మూడు రోజుల్లో ముగ్గురు సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని, తాము బలంగా ఉన్న స్థానాల నివేదికలను ఆ కమిటీకి సమర్పించాలని పిలుపునిచ్చారు. నాయకులు ఆసక్తిగా ఉన్నచోట, పార్టీకి పట్టున్న ప్రతి స్థానంలోనూ జనసేన బరిలో నిలవడం తథ్యమని పవన్ కళ్యాణ్ తేల్చిచెప్పారు.
