జన గళం సేవా డెస్క్: పేదరికం కారణంగా ఏ విద్యార్థి చదువు ఆగిపోకూడదనే సదాశయంతో మెగా యూత్ ఫోర్స్ మరోసారి తమ దాతృత్వాన్ని, సేవా దృక్పథాన్ని చాటుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన పేద విద్యార్థి కే. రిషి శ్రీ వేంకట దుర్గ పాండిచ్చేరిలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించేందుకు ఎంపికయ్యారు. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో కళాశాల ఫీజులు, హాస్టల్ ఖర్చులు భరించడం ఆ తల్లిదండ్రులకు భారంగా మారింది. తన కుమారుడి కల మధ్యలోనే ఆగిపోకూడదనే ఆవేదనతో ఆ విద్యార్థి తల్లి శ్రీమతి ఉష దీప్తి మెగా యూత్ ఫోర్స్‌ను ఆశ్రయించారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే మెగా యూత్ ఫోర్స్ వెస్ట్ తెలంగాణ కన్వీనర్ శ్రీ డి.వి.వి. సత్యనారాయణ మరియు వారి మిత్రబృందం తక్షణమే స్పందించారు. ఆ విద్యార్థి నాలుగు సంవత్సరాల ఇంజనీరింగ్ చదువుకు అవసరమైన పూర్తి బాధ్యతను తీసుకోవడానికి ముందుకు వచ్చారు. ఇందులో భాగంగా మొదటి సంవత్సరానికి సంబంధించి రూ. 1,00,000/- (ఒక లక్ష రూపాయల) విద్యా సహాయ చెక్కును శ్రీమతి సుస్మిత గారి చేతుల మీదుగా విద్యార్థి తల్లి ఉష దీప్తికి అందజేశారు. ఒక విద్యార్థికి సాయం చేయడం అంటే ఆ కుటుంబానికే కాకుండా భవిష్యత్ తరానికి వెలుగునివ్వడమేనని ఈ సందర్భంగా నిర్వాహకులు పేర్కొన్నారు. అభాగ్యులకు బాసటగా నిలుస్తున్న మెగా యూత్ ఫోర్స్ బృందాన్ని అఖిల భారత చిరంజీవి యువత ప్రతినిధులు, అభిమానులు హృదయపూర్వకంగా అభినందించారు.
