జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: అనకాపల్లి జిల్లా చోడవరం సహకార చక్కెర కర్మాగారానికి (గోవాడ షుగర్ ఫ్యాక్టరీ) చెరకు సరఫరా చేసి ఏళ్ల తరబడి బకాయిల కోసం ఎదురుచూస్తున్న అన్నదాతల జీవితాల్లో కూటమి ప్రభుత్వం వెలుగులు నింపింది. రైతులకు చెల్లించాల్సిన రూ. 28 కోట్ల పెండింగ్ బకాయిలను విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం అధికారికంగా ఆమోదముద్ర వేసింది. ఈ నిర్ణయం ద్వారా ఉత్తరాంధ్ర చెరకు రైతులకు సుదీర్ఘ కాలంగా నెలకొన్న ప్రధాన సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది.
ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా చోడవరం రైతులు స్వయంగా కలిసి అందించిన వినతిపత్రంపై జనసేన ఎమ్మెల్సీ ప్రత్యేక దృష్టి సారించారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో రైతుల పక్షాన నిలబడి, ఏపీ శాసనమండలి సమావేశాల్లో తన మొదటి ప్రశ్నగా ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. సంబంధిత శాఖల మంత్రులతో నిరంతరం సంప్రదింపులు జరిపి బకాయిల విడుదలకు కృషి చేశారు. ఫలితంగా నేటి కేబినెట్ భేటీలో రూ. 28 కోట్లు మంజూరు చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రజల నోరు తీపి చేసే రైతన్నలను ఆదుకున్నందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సంబంధిత మంత్రులు, కూటమి నాయకులకు జనసేన ఎమ్మెల్సీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
