జన గళం క్రైమ్ డెస్క్: రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా నూజివీడు డీఎస్పీ కే.వి.వి.ఎన్.వి. ప్రసాద్, పెదవేగి సీఐ సీహెచ్. రాజశేఖర్ ఆదేశాల మేరకు పెదపాడు పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఆటో డ్రైవర్లకు ప్రత్యేక కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెదపాడు ఎస్సై శ్రీనివాస్ డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలు, ప్రయాణికుల భద్రతపై దిశానిర్దేశం చేశారు.
ఆటో నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ఆర్సీ, ఫిట్‌నెస్ (FC), పొల్యూషన్ సర్టిఫికెట్లతో పాటు బీమా పత్రాలు ఎల్లప్పుడూ వాహనంలో అందుబాటులో ఉంచుకోవాలని స్పష్టం చేశారు. ప్రమాదాలు జరిగినప్పుడు ఇన్సూరెన్స్ రక్షణగా నిలుస్తుందని వివరించారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించే ఓవర్‌లోడింగ్‌ను పూర్తిగా నిషేధించాలని, మద్యం సేవించి వాహనాలు నడిపితే లైసెన్స్ రద్దు చేయడంతో పాటు కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా మహిళలు, పాఠశాల విద్యార్థులతో మర్యాదగా వ్యవహరిస్తూ, ట్రాఫిక్ సిగ్నల్స్, వేగ నియంత్రణ పాటిస్తూ పోలీసులకు సహకరించాలని ఎస్సై కోరారు.
