జన గళం ఒంగోలు బ్యూరో: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో పర్యటించారు. వైఎస్సార్‌సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ లిడ్‌క్యాప్ (LIDCAP) ఛైర్మన్ దివంగత కాకుమాను రాజశేఖర్ నివాసానికి వెళ్లిన ఆయన, శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను స్వయంగా పరామర్శించారు.
ఒంగోలు క్లౌ పేటలోని రాజశేఖర్ గృహానికి చేరుకున్న జగన్‌మోహన్‌రెడ్డి.. కాకుమాను రాజశేఖర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన సతీమణి, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాకుమాను రాజశేఖర్ అకాల మరణం పార్టీకి తీరని లోటని, పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన చూపిన నిబద్ధత, అంకితభావం మరువలేనివని గుర్తుచేసుకున్నారు. కుటుంబం ఎట్టి పరిస్థితుల్లోనూ అధైర్యపడవద్దని, వైఎస్సార్‌సీపీ కుటుంబం వారికి అన్ని వేళలా అండగా నిలుస్తుందని, అవసరమైన అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ పర్యటనలో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
