జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: కృష్ణా జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సమితి (విజయ డెయిరీ) నూతన చైర్మన్‌గా మాజీ శాసనసభ్యులు, సీనియర్ నాయకులు దాసరి వెంకట బాలవర్ధనరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల చలసాని ఆంజనేయులు డెయిరీ చైర్మన్ పదవితో పాటు డైరెక్టర్ పదవికి రాజీనామా చేయడంతో ఏర్పడిన అనిశ్చితికి, ఊహాగానాలకు తెరదించుతూ పార్టీ అధిష్టానం బాలవర్ధనరావు వైపు మొగ్గు చూపింది. రెండు పర్యాయాలు శాసనసభ్యుడిగా పనిచేయడంతో పాటు గత 15 సంవత్సరాలుగా పాల సొసైటీ డైరెక్టర్‌గా విశేష అనుభవం ఉన్న ఆయనకు పగ్గాలు అప్పగించాలని కూటమి నాయకత్వం నిర్ణయించింది.
మంగళవారం విజయ డెయిరీ ప్రధాన కార్యాలయంలో సమావేశమైన పాలకమండలి డైరెక్టర్లు దాసరి బాలవర్ధనరావు పేరును ప్రతిపాదించి ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం ఆయన నూతన చైర్మన్‌గా వేదమంత్రోచ్ఛారణల నడుమ బాధ్యతలు స్వీకరించారు. గన్నవరం నియోజకవర్గం నుంచి 1999, 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్న ఆయన, తన అనుభవాన్ని గుర్తించి చైర్మన్ పదవిని అప్పగించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్న పాడి రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, విజయ డెయిరీని మరింత లాభాల బాటలో పయనింపజేసేందుకు నిరంతరం శ్రమిస్తానని స్పష్టం చేశారు.
