జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని జనసేన పార్టీ అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. కాకినాడ పర్యటనలో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని జనసేన ముఖ్య నాయకులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు మరియు సమన్వయకర్తలతో ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. రాబోయే పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ మరియు మున్సిపల్ ఎన్నికల కార్యాచరణపై పార్టీ కేడర్‌కు సమగ్ర దిశానిర్దేశం చేశారు.
ఎన్నికల వ్యూహాలను పకడ్బందీగా అమలు చేస్తూ, పక్కా ప్రణాళికతో క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని పవన్ కళ్యాణ్ నాయకులకు సూచించారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా నియమించిన సమన్వయ కమిటీల పనితీరు, గ్రామ మరియు వార్డు స్థాయిల్లో చేపట్టాల్సిన విధివిధానాలపై స్పష్టతనిచ్చారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, ప్రజల సమస్యల పరిష్కారంలో కేడర్ చురుగ్గా భాగస్వామ్యం కావాలని ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సత్తా చాటేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన ఉద్ఘాటించారు.
