జన గళం జీవన శైలి & ఆలోచన డెస్క్: సమాజంలో ప్రతి మనిషి వెనుక ఎవరికీ కనిపించని ఒక కథ, పోరాటం దాగి ఉంటాయి. మనం చూసే వ్యక్తి కేవలం ఒక చివరి బొట్టు మాత్రమే. ఆ చుక్క వెనుక ఎంత పెద్ద కన్నీటి సుడిగుండం ఉందో పైనుంచి చూస్తే ఎప్పటికీ అర్థం కాదు. ఒకరి స్వభావం ఎప్పుడూ పుట్టుకతోనే రాదని, జీవితం విసిరిన దెబ్బలు, దిగమింగిన కన్నీళ్లు, నమ్మించి గొంతు కోసిన బంధాలు, కాపాడుకోవాల్సిన ఆత్మగౌరవం.. ఇవన్నీ కలిసే ఒక మనిషిని ఒక ప్రత్యేకమైన రీతిలో తీర్చిదిద్దుతాయని ప్రముఖ రచయిత మూర్తి నాయుడు పాదం తన భావవ్యక్తీకరణలో పేర్కొన్నారు.
ఎదుటివారిలో మన కంటికి కనిపించే చిన్న తప్పు వెనుక, వారు ఎన్నో ఏళ్లుగా మోస్తున్న నిస్సహాయత కారణం కావచ్చని విశ్లేషించారు. వారు నడిచి వచ్చిన కష్టాల దారి తెలియకుండా సులభంగా తీర్పులు చెప్పడం అనేది, ఆ వ్యక్తి పడిన గాయాన్ని చూడకుండా కారే రక్తాన్ని నిందించడంతో సమానమని స్పష్టం చేశారు. సగం మాత్రమే చదివిన పుస్తకానికి తుది తీర్పు ఇవ్వలేనట్లే, ఎదుటివారి అంతర్గత జీవిత యుద్ధం తెలియకుండా మన అల్పమైన అభిప్రాయంతో వారిని తూకం వేయడం కేవలం మన అపరిపక్వతే తప్ప ఇంకేం కాదని హితవు పలికారు. మనసుతో ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడే మానవ సంబంధాలు మరింత దృఢంగా బలపడతాయని ఉద్ఘాటించారు.
