జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: తన యావత్ జీవితాన్ని కాపు జాతి అభ్యున్నతి, సామాజిక సాధికారత కోసం అంకితం చేసిన నిష్కల్మష మానవతామూర్తి, కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ళ సుబ్రహ్మణ్యం (జననం: 18-01-1959) కన్నుమూశారు. ఆయన మంగళవారం (సెప్టెంబర్ 22, 2026) మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. సుదీర్ఘ కాలంగా కాపు ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ, ఎందరికో మార్గదర్శిగా, గురుతుల్యుడిగా నిలిచిన ఆయన మరణం కాపు వర్గానికే కాకుండా యావత్ సామాజిక వర్గాలకు తీరని లోటని పలువురు నేతలు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
దివంగత గాళ్ళ సుబ్రహ్మణ్యం అంతిమ యాత్ర రేపు (గురువారం, సెప్టెంబర్ 24, 2026) ఉదయం 9 గంటలకు విజయవాడ అయోధ్యనగర్‌లోని లోటస్ ల్యాండ్‌మార్క్ నివాసం నుంచి ప్రారంభం కానుంది. అనంతరం ఉదయం 10 గంటలకు అభిమానులు, నాయకులు, ప్రజల సందర్శనార్థం ఆయన పార్థివ దేహాన్ని గాంధీనగర్‌లోని కాపునాడు కార్యాలయంలో ఉంచనున్నట్లు ఆయన కుమారుడు గాళ్ళ అరవింద్, కుటుంబ సభ్యులు, కాపునాడు ప్రతినిధులు సంయుక్తంగా వెల్లడించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ పలువురు ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు నివాళులర్పించారు.
