జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం సరికొత్త డిజిటల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి . రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన సరికొత్త స్వయంచాలక లడ్డూ ప్రసాదం విక్రయ యంత్రాన్ని (లడ్డూ ఏటీఎం) దేవాదాయ శాఖ కమిషనర్ కే. రామచంద్రమోహన్ లాంఛనంగా ప్రారంభించారు అర్జున వీధి ప్రారంభంలోని సెంట్రల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ప్రాంగణంలో ఈ యంత్రాన్ని ఏర్పాటు చేశారు దేవస్థానంలో డిజిటలైజేషన్, ఆటోమేషన్ ప్రక్రియలను వేగవంతం చేసి భక్తులకు మరింత వేగంగా సేవలందించే దిశగా ఈ యంత్రాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు కమిషనర్ తెలిపారు దేవస్థాన సిబ్బందితో పనిలేకుండా భక్తులు నేరుగా మొబైల్ ద్వారా యూపీఐ లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డిజిటల్ పద్ధతిలో సొమ్ము చెల్లించి క్షణాల్లో లడ్డూల బాక్స్‌ను పొందవచ్చని వివరించారు ఇందులో భాగంగా బాక్స్‌కు రూ. 100 ధరతో ఆరు లడ్డూలు ఉండేలా నిర్ణయించామని, భక్తుల స్పందనను బట్టి మిగిలిన దేవాలయాల్లో కూడా వీటిని విస్తరిస్తామని పేర్కొన్నారు మరోవైపు దసరా శరన్నవరాత్రుల నేపథ్యంలో భక్తులు దళారులను నమ్మి నకిలీ పూజా టికెట్లతో మోసపోవద్దని, కేవలం ఆలయ అధికారిక వెబ్‌సైట్, యాప్ లేదా అధికారిక కౌంటర్లలోనే టికెట్లు తీసుకోవాలని సూచించారు
ఇంద్రకీలాద్రిపై వినూత్న సేవలు.. ఏటీఎం ద్వారా లడ్డూ ప్రసాదం విక్రయం ప్రారంభం!
