జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: కృష్ణా జిల్లా నందివాడ మండలంలో బుడమేరు వరద ఉధృతి కొనసాగుతుండటంతో అధికార యంత్రాంగం మరియు ప్రజాప్రతినిధులు అప్రమత్తమయ్యారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వచ్చి చేరుతున్న వరద నీటి కారణంగా పుట్టగుంట వంతెన వద్ద ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. అధికారులతో కలిసి వరద ప్రవాహ తీరును పరిశీలించిన ఆయన, ఎగువ నుంచి వస్తున్న నీటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. గతేడాది సంభవించిన వరదల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఈసారి ముందస్తుగా అన్ని తగు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.
పుట్టగుంట వంతెన వద్ద వరద ప్రవాహానికి తీవ్ర ఆటంకం కలిగిస్తున్న గుర్రపుడెక్కను తక్షణమే తొలగించాలని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అధికారులను ఆదేశించారు. వరద నీరు ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా కొల్లేరులోకి వెళ్లేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కేవలం అధికారుల మాటలతో సరిపెట్టకుండా, స్వయంగా ద్విచక్ర వాహనం మరియు ట్రాక్టర్‌పై స్థానిక రైతులతో కలిసి ముంపునకు గురైన పంట పొలాలు పెద్దలింగాల, చిన్నలింగాల, చేదుర్తిపాడు, ఒద్దులమేరక గ్రామాలలో పర్యటించి, ఆత్కూరు డ్రైన్ వద్ద ప్రవాహ స్థితిగతులను ఆయన పరిశీలించారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బతులను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ, వారికి ప్రభుత్వం తరఫున పూర్తి భరోసా కల్పించారు. బుడమేరు వరద నీరు వంతెనపై నుంచి ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని, పోలీసుల పర్యవేక్షణలో ట్రాఫిక్ నియంత్రణ చేపడుతున్నట్లు తెలిపారు.
వాతావరణ పరిస్థితులు మరియు వరద ఉధృతిని బట్టి త్వరలోనే పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుందని ఎమ్మెల్యే రాము ధైర్యం చెప్పారు. అయినప్పటికీ బుడమేరు పరీవాహక ప్రాంతాల ప్రజలు ఎవరూ ఆందోళన చెందకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరియు రైతులు ప్రభుత్వ యంత్రాంగం జారీ చేస్తున్న హెచ్చరికలను పాటించాలని కోరారు. ప్రాణనష్టం జరగకుండా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టామని, ఎక్కడైనా సమస్య తలెత్తితే వెంటనే స్పందించేందుకు సిబ్బంది సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, తహశీల్దార్ గురుమూర్తి రెడ్డి, జనసేన ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, స్థానిక నాయకులు మరియు అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని సహాయక చర్యలను పర్యవేక్షించారు.
Slug: budameru-flood-mla-venigandla-ramu-inspection-nandiwada
