జన గళం ప్రత్యేక విభాగం: సమాజంలో నైతిక విలువలను దిగజారుస్తూ, భారతీయ కుటుంబ వ్యవస్థను ధ్వంసం చేస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షోను తక్షణమే రద్దు చేయాలని ప్రజా పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, న్యాయవాది శ్రీ కె. బలరాం గారు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన భారత గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సెన్సార్ బోర్డు చైర్మన్ మరియు శాటిలైట్ రైట్స్ విభాగానికి ఒక బహిరంగ లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచమంతా మన పవిత్ర భారతీయ కుటుంబ వ్యవస్థను చూసి గౌరవిస్తుంటే, విదేశీ విష సంస్కృతిని దిగుమతి చేసుకుని రియాలిటీ షోల పేరుతో ఇళ్లలోకి చొప్పిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో ఒక వీధిలో పెళ్లికాని యువతీయువకులను కలిపి ఉంచితే చట్టవిరుద్ధంగా పరిగణించే పరిస్థితులు ఉండగా, అదే ప్రక్రియను నాలుగు కెమెరాలు, రంగురంగుల లైట్లు పెట్టి టీవీల్లో 24 గంటలూ ప్రసారం చేస్తూ నెంబర్ వన్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా చిత్రీకరించడం వెనుక పెద్ద మోసం దాగి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి షోలు రాబోయే భావితరాల పిల్లల ఆలోచనలను పెడదోవ పట్టిస్తూ, సహజీవనం, అశ్లీలత, గొడవలు, విలువలు లేని ప్రవర్తనను సాధారణ విషయాలుగా మార్చేస్తున్నాయని మండిపడ్డారు.
ఇప్పటికే టీవీ సీరియళ్ల వల్ల కుటుంబాల్లో మానసిక ఒత్తిళ్లు పెరిగాయని, బిగ్ బాస్ వంటి షోలు మన సాంస్కృతిక వేర్లకే పురుగుమందులా మారాయని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి రిమోట్‌కు తామే బిగ్ బాస్ కావాలని, ఇలాంటి ఛానెళ్లను బహిష్కరించి కుటుంబాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. భారతీయ సనాతన సంస్కృతిని, యువత భవిష్యత్తును కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం, అత్యున్నత న్యాయస్థానం వెంటనే స్పందించి బిగ్ బాస్ షో ప్రసారాలను పూర్తిగా నిషేధించాలని ప్రజా పరిరక్షణ సమితి తరఫున కోరారు.
Slug: demand-to-ban-big-boss-reality-show-praja-parirakshana-samiti-president-advocate-k-balaram
