రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి నాదెండ్ల మనోహర్
- విఘ్నాలు తొలగి ప్రతి ఇంటా సుఖసంతోషాలు నిండాలని ఆకాంక్ష
- పర్యావరణ హితంగా మట్టి వినాయకులనే పూజిద్దాం: మంత్రి పిలుపు
- కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని ప్రార్థన
అమరావతి / తెనాలి:
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ రాష్ట్ర ప్రజలకు, తెనాలి నియోజకవర్గ ప్రజానీకానికి, జనసేన-కూటమి శ్రేణులకు హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సకల విఘ్నాలను తొలగించే ఆ విఘ్నాధిపతి దివ్య ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు తలపెట్టే ప్రతి కార్యం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తోందని, ఆ గణనాథుని కృపతో రాష్ట్రం మరింత సుభిక్షంగా, అభివృద్ధి వైపు సాగాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రతి కుటుంబంలో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శ్రేయస్సు వెల్లివిరియాలని కోరుకున్నారు.
ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తుచేస్తూ, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ) విగ్రహాలకు బదులు పర్యావరణ హితమైన మట్టి వినాయక ప్రతిమలనే పూజించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వినాయక మండపాల వద్ద భద్రతా నిబంధనలు పాటిస్తూ, నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
