ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన దుర్గగుడి ట్రస్ట్ బోర్డ్ మెంబర్ పద్మావతి ఠాకూర్
- విఘ్నాలు తొలగి ప్రతి ఇంటా సుఖసంతోషాలు, విజయాలు నిండాలని ఆకాంక్ష
- పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకులనే పూజిద్దాం: పద్మావతి ఠాకూర్ పిలుపు
విజయవాడ:
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం (ఇంద్రకీలాద్రి) ట్రస్ట్ బోర్డ్ మెంబర్, జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి పద్మావతి ఠాకూర్ బెజవాడ నగర ప్రజలకు, రాష్ట్ర ప్రజానీకానికి, భక్తులకు మరియు కూటమి శ్రేణులకు హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సకల విఘ్నాలను తొలగించి భక్తుల కోరికలు తీర్చే ఆ విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులతో నగర ప్రజలందరి జీవితాల్లో ఎదురయ్యే సమస్యలు తొలగిపోయి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకున్నారు. అమ్మవారి ఆశీస్సులతో పాటు ఆ విఘ్నాధిపతి కృపతో రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకు అనుగుణంగా ప్రజలందరికీ మంచి జరగాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
మన సనాతన ధర్మంలో ప్రకృతి పూజకు అత్యంత ప్రాధాన్యత ఉందని గుర్తుచేస్తూ, పర్యావరణ పరిరక్షణను బాధ్యతగా తీసుకుని ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలనే పూజించాలని విజ్ఞప్తి చేశారు. వినాయక నవరాత్రి మహోత్సవాలను ప్రజలంతా సంప్రదాయబద్ధంగా, పవిత్ర భావనతో, ఆనందోత్సాహాల నడుమ శాంతియుతంగా జరుపుకోవాలని శ్రీమతి పద్మావతి ఠాకూర్ ఆకాంక్షించారు.
