జన గళం ప్రత్యేక డెస్క్: హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. తెలంగాణ సాంస్కృతిక సారథిలో అర్హులైన కళాకారులకు వెయ్యి ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ భారీ సంఖ్యలో కళాకారులు మంత్రి జూపల్లి కృష్ణారావును అడ్డుకున్నారు. మంత్రి కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన కళాకారులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు.
ఈ ఆందోళన సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కొందరు కళాకారులు మంత్రి జూపల్లి కృష్ణారావు కాళ్లపై పడి వేడుకున్నప్పటికీ ఆయన పట్టించుకోకుండా ముందుకు సాగిపోవడంతో మహిళా కళాకారిణులు తీవ్ర ఆవేదన చెంది కన్నీళ్లు పెట్టుకున్నారు. తమకు న్యాయం చేయాలని ప్రాధేయపడినా స్పందించకపోవడంతో వారు మరింత ఆందోళన చెందారు. మంత్రి బయటకు వెళ్లకుండా అడ్డుకుని ఆయన వాహనాన్ని సైతం నిర్బంధించారు.
కళాకారులు భారీగా చుట్టుముట్టి ఆందోళన చేస్తున్నప్పటికీ, మంత్రి జూపల్లి కృష్ణారావు వారిని తోసుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ పరిణామంతో అక్కడ ఒక్కసారిగా తీవ్ర గందరగోళం నెలకొంది. ఎన్నికల సమయంలో కళాకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సాంస్కృతిక సారథిలో ఉపాధి కల్పించాలని కళాకారులు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు.
Slug: ravindra-bharathi-minister-jupally-krishna-rao-artists-protes
