జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: అమెరికాలో స్థిరపడిన గుంటూరు జిల్లాకు చెందిన ప్రవాస భారతీయులు తమ మాతృభూమిపై ఉన్న మమకారాన్ని చాటుకుంటూ అత్యంత ఉదారతను ప్రదర్శించారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాన్ఫ్రాన్సిస్కో వర్సిటీకి ఏకంగా పది కోట్ల రూపాయల మేర భారీ విరాళాన్ని అందజేసి అందరిచేతా ప్రశంసలు అందుకున్నారు. డాక్టర్ అంబటి శ్రీమన్నారాయణ, రమ దంపతులు ఈ విరాళాన్ని అందించగా, ఈ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి దానిపై వచ్చే వార్షిక ఆదాయాన్ని ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకార వేతనాలుగా అందించనున్నారు. కాలిఫోర్నియాలోని ఫ్రెజ్నో పట్టణంలో ప్రత్యేకంగా నిర్వహించిన కార్యక్రమంలో అంబటి దంపతులు ఈ విరాళాన్ని అధికారికంగా అందజేశారు.
ఈ సందర్భంగా వర్సిటీ డీన్ జోస్ ఎం. బారల్ సాంచేజ్ మాట్లాడుతూ అంబటి దంపతులు అందించిన ఈ భారీ విరాళం గ్రామీణ వైద్యం, అల్ట్రాసౌండ్ సాంకేతికత మరియు కుటుంబ వైద్యం వంటి కీలక రంగాలలో పరిశోధనలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు, భవిష్యత్ వైద్యులకు ఇది గొప్ప ప్రోత్సాహాన్నిస్తుందని పేర్కొన్నారు. ప్రతిభ ఉన్న విద్యార్థులకు ఆర్థికంగా అండగా నిలవడంతో పాటు, వైద్య రంగంలో ఉన్నత పరిశోధనలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఈ విరాళం ఇచ్చినట్లు డాక్టర్ శ్రీమన్నారాయణ తెలిపారు.
భారతదేశంతో పాటు తాను దశాబ్దాలుగా స్థిరపడిన అమెరికా సమాజానికి కూడా తన వంతుగా సేవ చేయాలనే సదుద్దేశంతోనే ఈ సహాయం అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. డాక్టర్ అంబటి శ్రీమన్నారాయణ 1986 సంవత్సరం నుంచి యూసీఎస్ఎఫ్ వర్సిటీలో యూరాలజీ క్లినికల్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా అదే విశ్వవిద్యాలయంలో వైద్యుడిగా, ప్రొఫెసర్గా సేవనందిస్తున్న ఆయన, ఇప్పుడు తన వంతు సహాయంగా విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన బాటలు వేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Slug: guntur-couple-donates-10-crores-ucsf-university-america
