జన గళం గన్నవరం/బాపులపాడు బ్యూరో: కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం, బాపులపాడు మండల పరిధిలోని జాతీయ రహదారిపై వాహనదారుల ప్రాణాలకు ముప్పుగా మారిన సమస్యకు తక్షణ పరిష్కారం లభించింది. NH 216 H (మచిలీపట్నం – నూజివీడు – కల్లూరు / MNK) ప్రధాన రహదారిపై ఉన్న పెరికీడు కాలువ వంతెన రక్షణ గోడలు (సైడ్ వాల్స్) కూలిపోయి తీవ్ర ప్రమాదకర స్థితికి చేరుకున్నాయి. అటుగా వెళ్తున్న సమయంలో ఈ పరిస్థితిని గుర్తించిన గన్నవరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APRDC) డైరెక్టర్ శ్రీ గరికిపాటి శివ శంకర్ తక్షణమే రంగంలోకి దిగారు.
ప్రయాణికులు, వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆయన జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ఉన్నతాధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, వంతెన గోడల మరమ్మతులను తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. ఆయన చొరవతో అధికారులు యుద్ధప్రాతిపదికన స్పందించి రక్షణ గోడల పునర్నిర్మాణ పనులను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయికి చేరుకున్న గరికిపాటి శివశంకర్ నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించారు. వంతెన పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, రాత్రి వేళల్లో సైతం వాహనదారులు గుర్తించేలా సరైన రేడియం సూచికలు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజా సమస్యపై తక్షణమే స్పందించి ప్రమాదాన్ని నివారించిన ఏపీఆర్‌డీసీ డైరెక్టర్ గరికిపాటి శివశంకర్‌కు స్థానిక ప్రజలు, వాహనదారులు ధన్యవాదాలు తెలిపారు.
