జన గళం అవనిగడ్డ/మోపిదేవి బ్యూరో: శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి వారి దివ్య కృపాకటాక్షాలతో ప్రకృతి కరుణించి, రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని అవనిగడ్డ శాసనసభ్యులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ ఆకాంక్షించారు. మంగళవారం కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెద్దకళ్ళేపల్లి గ్రామంలో వెలసియున్న సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి వారి దేవస్థానంలో వరుణ దేవుని అనుగ్రహం కోసం వేద పండితుల ఆధ్వర్యంలో వరుణ జపం, వరుణ హోమం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
వర్షాభావ పరిస్థితులు పూర్తిగా తొలగి, రైతాంగం సుభిక్షంగా ఉండాలని, లోకకళ్యాణార్థం స్వామివారి మూలవిరాట్టుకు 1000 కలశాలతో శాస్త్రోక్తంగా సహస్ర ఘటాభిషేకం జరిపించారు. ఈ విశేష పూజా కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్.. హోమ గుండం వద్ద ప్రత్యేక పూజలు చేసి, మూలవిరాట్ సహస్ర ఘటాభిషేకంలో స్వయంగా పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో కొలువై ఉన్న అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల కార్యనిర్వహణాధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సత్కరించగా, వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు నడకుదుటి జనార్ధనరావు, పీఏసీఎస్ చైర్మన్ అరజా రాధిక, లయన్స్ క్లబ్ అధ్యక్షులు గొర్రెపాటి రమేష్ చంద్రబాబు, ఏఎంసీ డైరెక్టర్ మెరకనపల్లి నరేష్, జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడు కేతరాజు శ్రీనివాసరావు, జనసేన నాయకులు గోళ్ళ శ్రీనివాసరావు, అరజా కిరణ్ కాంత్, బాదర్ల లోలాక్షు నాయుడు, గోళ్ళ వెంకటేశ్వరరావు, అరజా చలపతి, గుమ్మడి నరసింహారావు, టీడీపీ నేతలు గొర్రెపాటి దుర్గా నాగేశ్వరరావు, అరజా జ్ఞాన సుందరరావు (చంటి), జనసైనికులు మేడిశెట్టి పవన్, యర్రంశెట్టి హరీష్, దేవస్థాన అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
