jangalam24 ఆంధ్రప్రదేశ్ డెస్క్: బంటుమిల్లి ప్రధాన కాలువ పరిధిలోని ఆయకట్టు రైతులకు న్యాయం చేయాలని, వంతులవారీ విధానంలో కనీసం పది రోజుల పాటు నిరంతరాయంగా సాగునీరు అందించి వరి పంటను కాపాడాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కృష్ణా జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి నాగేశ్వరరావు నేతృత్వంలో ప్రతినిధి బృందం కృష్ణా జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వక వినతిపత్రం అందజేసింది. ప్రధాన కాలువ కింద ఉన్న చోరంపూడి, వడ్లగరువు కాలువల పరిధిలో తీవ్ర నీటి కొరత ఏర్పడి పంటలు ఎండిపోయే ప్రమాదం ముంచుకొస్తోందని, తక్షణమే అధికార యంత్రాంగం స్పందించి సాగునీటి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
లక్ష్మీనారాయణపురం వద్ద విడిపోయే ఎనిమిది కిలోమీటర్ల పొడవైన చోరంపూడి కాలువ కింద సుమారు రెండు వేల నాలుగు వందల ఎకరాల ఆయకట్టు ఆధారపడి ఉందని రైతులు వినతిపత్రంలో వివరించారు. కాలువల ఆధునీకరణ పేరుతో గతంలో ఉన్న డ్రాప్‌ను తొలగించారని, అదే స్థానంలో కొత్త డ్రాప్ నిర్మించకపోవడంతో ఎగువ, దిగువ ప్రాంతాల రైతుల మధ్య తరచూ తీవ్ర వివాదాలు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాలువ దిగువన వరి సాగు చేస్తున్న రైతులు నీరందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో భౌతిక పరిశీలన జరిపి యోగ్యమైన ప్రదేశంలో వెంటనే డ్రాప్ నిర్మాణం చేపట్టాలని కోరారు.
అదేవిధంగా మూలపర్రు వద్ద ఉన్న వడ్లగరువు కాలువను నిబంధనలకు విరుద్ధంగా యంత్రాలతో ఇష్టానుసారంగా లోతుగా తవ్వేయడం వల్ల నీటి ప్రవాహం సక్రమంగా సాగడం లేదని రైతు సంఘం నేతలు ఆరోపించారు. ఈ అస్తవ్యస్త తవ్వకాల వల్ల కాలువ పైభాగంలో నీరు నిలిచిపోవడంతో పాటు ఇతర ప్రాంతాలకు నీరందని దుస్థితి నెలకొందని వాపోయారు. కాలువల పరిస్థితిపై సమగ్ర విచారణ జరిపి నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిపిన వారిపై చర్యలు తీసుకోవాలని, వెంటనే వంతులవారీ విధానంలో నీటి విడుదల కాలాన్ని పెంచి చివరి ఆయకట్టు వరకు సాగునీరందేలా పర్యవేక్షించాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని కోరారు.
