జన గళం తిరువూరు/ఎన్టీఆర్ జిల్లా డెస్క్: ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని తిరువూరు నగర పంచాయతీ/మున్సిపల్ ఎన్నికల సమరంలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే వేళ అనూహ్య రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. తిరువూరు మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచిన ప్రముఖ వైద్యులు డాక్టర్ పెనుమల్లి నాగేశ్వరరావు గారి సతీమణి శ్రీమతి పెనుమల్లి శ్రావణి గారు తన నామినేషన్‌ను అధికారికంగా ఉపసంహరించుకున్నారు. బుధవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కలిసి ఆమె తన ఉపసంహరణ పత్రాలను సమర్పించారు.
గత కొద్ది రోజులుగా తిరువూరు స్థానిక ఎన్నికల పొత్తులు, సీట్ల సర్దుబాటు, వార్డుల వారీ సమీకరణాలపై కూటమి ముఖ్య నేతల మధ్య అంతర్గతంగా విస్తృత సమాలోచనలు సాగాయి. ఈ నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ, కూటమి ఐక్యత, భవిష్యత్ రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా పెద్దల సూచనల మేరకు ఆమె పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. డాక్టర్ పెనుమల్లి నాగేశ్వరరావు కుటుంబానికి తిరువూరు నియోజకవర్గంలో వైద్య సేవలతో పాటు సామాజికంగా, రాజకీయంగా విశేష ఆదరణ ఉంది. శ్రావణి గారు పోటీ నుంచి విరమించుకోవడంతో సదరు వార్డులో ఎన్నికల సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అధికారిక కూటమి అభ్యర్థి ఘన విజయం సాధించేందుకు తమవంతు సంపూర్ణ సహకారం అందిస్తామని ఈ సందర్భంగా ఆ వర్గం స్పష్టం చేసింది.
