జన గళం పెడన డెస్క్: రాబోయే స్థానిక సంస్థల సమరంలో ప్రజలంతా బాధ్యతాయుతంగా ఆలోచించి, నిజాయితీ మరియు నిబద్ధత కలిగిన నాయకులకే మద్దతు పలకాలని 2024 సార్వత్రిక ఎన్నికల్లో పెడన స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ప్రముఖ నాయకుడు శ్రీ ఎస్.వి. బాబు సమ్మెట పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది కేవలం హక్కు మాత్రమే కాదని, రాబోయే ఐదేళ్ల పాటు మన పల్లె, మన వార్డు, మన ప్రాంత సమగ్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేసే తిరుగులేని ఆయుధమని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక సమస్యలు, ఎన్నికల ప్రాధాన్యతను వివరిస్తూ పెడన నియోజకవర్గ ప్రజలనుద్దేశించి ఆయన ఒక సమగ్ర బహిరంగ లేఖను విడుదల చేశారు.
గ్రామ పంచాయతీలు, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లతో పాటు పురపాలక సంఘాలు (మున్సిపాలిటీలు) సామాన్య ప్రజల నిత్యజీవిత సమస్యలతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటాయని ఆయన గుర్తుచేశారు. తాగునీటి సరఫరా, అంతర్గత రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాల వంటి మౌలిక వసతుల కల్పనలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పాత్ర అత్యంత కీలకమని స్పష్టం చేశారు. కేవలం ఎన్నికల వేళ కనిపించే రాజకీయ నేతలను కాకుండా, ప్రజల కష్టాల్లో నిరంతరం అందుబాటులో ఉంటూ స్పందించే నాయకులను ఎన్నుకోవాల్సిన చారిత్రక బాధ్యత ఓటర్లపై ఉందని వివరించారు.
సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల మధ్య పనిచేసిన అనుభవంతో తాను ఈ విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపిన ఎస్.వి. బాబు.. ఓటు వేసే సమయంలో కులాన్ని కాకుండా అభ్యర్థి గుణాన్ని, మతాన్ని కాకుండా వ్యక్తిత్వాన్ని, తాత్కాలిక బంధుత్వాలను కాకుండా బాధ్యతను చూడాలని హితవు పలికారు. పార్టీ గుర్తులను మాత్రమే గుడ్డిగా నమ్మకుండా సదరు అభ్యర్థికి ఉన్న ప్రజాసేవా దృక్పథం, నిజాయితీ, సమర్థతలను బేరీజు వేసుకోవాలని సూచించారు. మద్యానికి, డబ్బుకు లేదా ఇతర తాయిలాలకు లొంగి ఓటేస్తే భవిష్యత్ తరాల ఎదుగుదలను తాకట్టు పెట్టినట్లే అవుతుందని హెచ్చరించారు. పార్టీలకు, రాజకీయ విభేదాలకు అతీతంగా స్థానిక ప్రగతిని కాంక్షించే సమర్థులైన వ్యక్తులను గెలిపించుకోవాలని, పెడన ప్రాంతాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకోవాలని ఆయన కోరారు.
