జన గళం విజయవాడ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో సరికొత్త రాజకీయ అధ్యాయానికి తెరలేచింది. రాష్ట్ర ప్రజల ఆత్మబంధువు, ప్రజా గళం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు, ప్రజా హృదయ నేత స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారి ఆశయాల వారసుడు శ్రీ వంగవీటి రాధాకృష్ణ (రాధా) గారు జతకట్టారు. జనసేన పార్టీలో అధికారికంగా చేరిన ఆయనను ఎన్డీయే కూటమి (టీడీపీ – జనసేన – బీజేపీ) బలపరిచిన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా బరిలోకి దింపడంతో బెజవాడ రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఈ కలయిక అటు జనసైనికులు, ఇటు రంగా-రాధా అభిమానుల్లో నూతన ఉత్సాహాన్ని నింపడమే కాక రాష్ట్రవ్యాప్తంగా పెను రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
సత్తా ఉన్న రాజకీయ పార్టీతో.. తిరుగులేని ప్రజాధరణ, ఖలేజా ఉన్న ప్రజా నాయకుడు కలిస్తే ప్రజల సంక్షేమానికి, ప్రాంత అభివృద్ధికి ఎలాంటి సరికొత్త బాటలు పడతాయో ఈ పరిణామం ప్రత్యక్షంగా నిరూపిస్తోందని అఖిల భారత చిరంజీవి యువత ప్రతినిధి శ్రీ రవణం స్వామినాయుడు గారు పేర్కొన్నారు. విజయవాడ నగరాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సుందరంగా తీర్చిదిద్దేందుకు, బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని ఇంటింటికీ చేర్చేందుకు వంగవీటి రాధా గారి నాయకత్వం తిరుగులేని ఆయుధంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పేదల పక్షపాతిగా ఎల్లవేళలా ప్రజల కష్టాల్లో నిలిచే రాధా గారు మేయర్ పీఠాన్ని అధిరోహించడం ద్వారా బెజవాడ సమగ్ర రూపురేఖలు మారిపోవడం తథ్యమని శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సుపరిపాలనా సంకల్పానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి విజన్‌కు నిలువెత్తు రూపంగా రాధాకృష్ణ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కూటమి శ్రేణులు ప్రతినబూనాయి. బెజవాడ నగరంలోని అన్ని డివిజన్ల ప్రజలు తమ అమూల్యమైన ఓటును జనసేన పార్టీ ఎన్నికల గుర్తు అయిన ‘గాజు గ్లాస్’ గుర్తుపై వేసి వంగవీటి రాధాకృష్ణ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని రవణం స్వామినాయుడు గారు పిలుపునిచ్చారు.
