జన గళం ప్రత్యేక డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికల వేళ జనసేన పార్టీలో టికెట్ల కేటాయింపు ప్రక్రియ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్టీ స్థాపించిన తొలిరోజు నుంచి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సొంత సొమ్ము వెచ్చించి జెండాలు మోసిన నిస్వార్థ కార్యకర్తలు, గ్రామాల్లో పార్టీని బతికించిన వీర మహిళలకు సముచిత స్థానం దక్కడం లేదనే నిరసన జ్వాలలు క్షేత్రస్థాయిలో భగ్గుమంటున్నాయి. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో సైతం కార్పొరేటర్, ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్ వంటి స్థానిక ప్రజాప్రతినిధుల పదవులను అర్హులైన నిబద్ధత గల కార్యకర్తలకు కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కట్టబెడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాల్సిన కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల వైఖరిపై శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కింది స్థాయి నుంచి నిబద్ధతతో పనిచేసిన స్థానిక నాయకులను ప్రజాప్రతినిధులుగా గెలిపించుకుంటే, భవిష్యత్తులో ఆయా నియోజకవర్గాల్లో జనసేన తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదుగుతుంది. అయితే అలా సొంత పార్టీ బలపడితే భవిష్యత్ ఎన్నికల్లో టీడీపీకి రాజకీయంగా ఇబ్బందులు తలెత్తుతాయనే ఒక వ్యూహాత్మక ఆలోచనతోనే.. కొందరు ప్రధాన నాయకులు లాలూచీ పడ్డారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనసేన కోటాలో దక్కిన అరకొర 30 శాతం సీట్లను కూడా పార్టీ మూలస్తంభాలైన ఒరిజినల్ జనసైనికులకు ఇవ్వకుండా, ఇటీవల టీడీపీ మరియు వైసీపీ నుంచి వలస వచ్చిన వారికే ప్రాధాన్యతనిచ్చి కేటాయించడం వెనుక పెద్ద ఎత్తున అంతర్గత రాజకీయ బేరసారాలు జరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వలస వచ్చిన నాయకులు తాము చెప్పినట్లు తల ఊపుతారన్న ఉద్దేశంతోనే, అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను సైతం తుంగలో తొక్కుతూ సొంత పార్టీ నాయకత్వమే వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడుతోందని కేడర్ ఆవేదన చెందుతోంది. ఆవిర్భావం నుంచి రక్తం ధారపోసిన వారిని విస్మరించి, నిన్నగాక మొన్న వచ్చిన వారికి పదవులు కట్టబెడితే పార్టీ భవిష్యత్తుకే తీరని నష్టం వాటిల్లుతుందని సీనియర్లు హెచ్చరిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు తక్షణమే ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, టికెట్ల అమ్మకాలు మరియు లోపాయికారీ ఒప్పందాలకు తెరదించి, క్షేత్రస్థాయి కార్యకర్తల ఆత్మగౌరవాన్ని కాపాడాలని పార్టీ శ్రేణులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి.
Source By Social Media
