జన గళం నెల్లూరు డెస్క్: నెల్లూరు నగరపాలక సంస్థ (ఎన్‌ఎంసీ) స్థానిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి పొత్తు చర్చలు పూర్తిగా విఫలమయ్యాయి. కార్పొరేషన్ పరిధిలోని డివిజన్లలో జనసేన పార్టీకి నామమాత్రంగా అత్యంత తక్కువ సీట్లు కేటాయిస్తామనడంతో, ఆ ప్రతిపాదనను తిరస్కరించి ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు నెల్లూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ గారు అధికారిక ప్రకటన చేశారు.
క్షేత్రస్థాయిలో పార్టీ బలం, కార్యకర్తల శ్రమను గుర్తించకుండా అతి తక్కువ స్థానాలు కేటాయిస్తే అంగీకరించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. జనసేన పార్టీ మొదట్నుంచీ న్యాయబద్ధంగా అడిగిన 30 శాతం స్థానాల్లో మాత్రమే పార్టీ అభ్యర్థులను ఒంటరిగా బరిలోకి దించుతున్నట్లు ప్రకటించారు. మిగిలిన స్థానాల్లో అనవసర రాద్ధాంతాలకు తావులేకుండా, తాము కోరిన డివిజన్లలోనే గెలుపే లక్ష్యంగా పోటీ చేస్తామని తేల్చిచెప్పారు. పోటీ చేసే అభ్యర్థులందరికీ గురువారం ఉదయం అధికారికంగా పార్టీ బీ-ఫారాలు (B-Forms) అందజేసి ప్రచార సమరంలోకి దింపుతున్నామని ఆయన వెల్లడించారు.
