జన గళం ప్రత్యేక డెస్క్: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల సమరంలో జనసేన పార్టీ కార్యకర్తలు, వీర మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు పార్టీ అధిష్టానం నిరంతరం అండగా నిలుస్తోంది. పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సీట్ల సర్దుబాటు మరియు నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా క్షేత్రస్థాయిలో చోటుచేసుకున్న ఉద్రిక్తతల నడుమ.. జనసైనికులు, వీర మహిళలు కార్పొరేటర్, కౌన్సిలర్ అభ్యర్థులుగా నామినేషన్లు వేయకుండా స్థానిక టీడీపీ శ్రేణులు అడ్డంకులు సృష్టించిన తరుణంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి గారు తక్షణమే స్పందించి కీలక పాత్ర పోషించారు. క్షేత్రస్థాయి నుంచి అందిన సమాచారంతో రంగంలోకి దిగిన ఆయన.. అభ్యర్థులకు పూర్తిస్థాయి భరోసా కల్పించి, ఎలాంటి ఆటంకాలు లేకుండా నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయ్యేలా చూశారు.
పొత్తు ధర్మం అమలులో కిందిస్థాయిలో కొన్నిచోట్ల ఎదురవుతున్న ఒత్తిళ్లను అధిగమిస్తూ, జనసేన జెండా మోసిన ప్రతి కార్యకర్త హక్కును కాపాడటంలో రామ్ తాళ్లూరి గారు ప్రదర్శించిన సమయస్ఫూర్తిని పార్టీ వర్గాలు కొనియాడుతున్నాయి. నామినేషన్ కేంద్రాల వద్దకు చేరుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్న వీర మహిళలు, జనసైనికులకు అండగా నిలిచి, అధికార యంత్రాంగంతో సమన్వయం చేస్తూ సకాలంలో నామినేషన్లు దాఖలయ్యేలా చర్యలు తీసుకున్నారు.
కార్యకర్తలకు, డివిజన్ స్థాయి చిన్నపాటి నాయకులకు నిత్యం అందుబాటులో ఉంటూ, సమస్య వచ్చినప్పుడు తక్షణమే పరిష్కరించే ఇలాంటి నాయకత్వమే పార్టీకి అసలైన బలమని జనసైనికులు పేర్కొంటున్నారు. అధినేత, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా కేడర్‌ను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న శ్రీ రామ్ తాళ్లూరి గారికి స్థానిక జనసైనికులు, వీర మహిళలు మనస్ఫూర్తిగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
