జన గళం విజయవాడ డెస్క్: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల సమరంలో భాగంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం సరికొత్త ఊపందుకుంది. ఎన్డీయే కూటమి (టీడీపీ – జనసేన – బీజేపీ) బలపరిచిన జనసేన పార్టీ అధికారిక మేయర్ అభ్యర్థి శ్రీ వంగవీటి రాధాకృష్ణ (రాధా) గారు విజయవాడ బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, సభ్యులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగర భవిష్యత్ ప్రణాళికలు, నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, వ్యాపార అనుకూల వాతావరణంపై ఈ సమావేశంలో కూటమి నాయకులు, బిల్డర్లతో లోతుగా చర్చించారు.
ఈ సందర్భంగా బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. గతంలో నిర్మాణ రంగం ఎదుర్కొన్న ఇబ్బందులు, అనుమతుల ప్రక్రియలో జాప్యం, మౌలిక సదుపాయాల సమస్యలను రాధా గారి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన వంగవీటి రాధాకృష్ణ గారు.. సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి విజన్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పారదర్శక పాలనా సంకల్పంతో విజయవాడను ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో కూడిన నగరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. నిర్మాణ రంగానికి అవసరమైన మౌలిక వసతులు, సింగిల్ విండో అనుమతుల సరళీకరణ, తాగునీరు, డ్రైనేజీ నెట్వర్క్ ఆధునీకరణపై మేయర్ పీఠం దక్కిన వెంటనే ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు.
నగర ఆర్థిక వ్యవస్థకు, ఉపాధి కల్పనకు వెన్నెముకగా నిలిచే రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగానికి అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బెజవాడ రూపురేఖలు మారిపోవాలంటే, స్థానిక పాలనలో జవాబుదారీతనం రావాలంటే కూటమి మేయర్ అభ్యర్థిగా తనను మరియు కార్పొరేటర్ అభ్యర్థులందరినీ ‘గాజు గ్లాస్’ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులను రాధాకృష్ణ గారు కోరారు. ఈ భేటీలో అసోసియేషన్ ప్రముఖులు, కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
