జన గళం కృత్తివెన్ను/పెడన డెస్క్: కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ పరిధిలోని కృత్తివెన్ను మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల సమరం తుది అంకానికి చేరింది. శుక్రవారం నామినేషన్ల గడువు ముగింపు సందర్భంగా మండల పరిధిలోని చెరుకుమిల్లి, యండపల్లి ఎంపీటీసీ (MPTC) స్థానాలకు జనసేన పార్టీ తరఫున పలువురు మహిళా నాయకురాళ్లు ఉత్సాహంగా నామినేషన్ పత్రాలను సమర్పించారు. చెరుకుమిల్లి మరియు యండపల్లి సెగ్మెంట్ల నుంచి జనసేన పార్టీ తరఫున నాయకురాళ్లు శ్రీమతి యర్రంశెట్టి నాగ శ్రీదేవి గారు, శ్రీమతి పిన్నెంటి వెంకట సూర్యకుమారి గారు, శ్రీమతి బాండ్ రెడ్డి మహాలక్ష్మి గారు, శ్రీమతి పిన్నెంటి జ్యోతి గార్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తమ నామినేషన్లను లాంఛనంగా దాఖలు చేశారు.
ఈ నామినేషన్ల కార్యక్రమానికి కృత్తివెన్ను మండల మరియు గ్రామ స్థాయి ఎన్డీయే కూటమి (టీడీపీ – జనసేన – బీజేపీ) నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మద్దతు పలికారు. ఈ సందర్భంగా కూటమి ముఖ్య నాయకులు మాట్లాడుతూ.. ఉప ముఖ్యమంత్రి, జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకు కట్టుబడి మహిళా సాధికారత, గ్రామీణ ప్రాంతాల సమగ్ర వికాసమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. పార్టీ నిబంధనల ప్రకారం వేర్వేరు సెట్ల నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ, పార్టీ రాష్ట్ర అధిష్టానం పరిశీలన అనంతరం ఎవరి అభ్యర్థిత్వాన్ని తుదిగా ఖరారు చేసి అధికారిక బీ-ఫారమ్ అందజేస్తే వారి గెలుపు కోసమే కూటమి శ్రేణులన్నీ ఏకతాటిపై నిలిచి ఐక్యంగా పనిచేస్తాయని స్పష్టం చేశారు. మండల పరిధిలోని అన్ని ఎంపీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని హోరెత్తిస్తామని వెల్లడించారు.
