పెడనలో జనసేనలోకి వైసీపీ నాయకుల చేరికలు.. ముచ్చర్లలో పలువురికి పార్టీ కండువాలు
Slug: ysrcp-leaders-join-janasena-in-mucharla-pedana
జన గళం కృష్ణా జిల్లా డెస్క్:
పెడన నియోజకవర్గంలో జనసేన పార్టీలోకి చేరికల పరంపర కొనసాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయాల అనంతరం నియోజకవర్గంలో రాజకీయంగా చేరికలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో పెడన మండలం ముచ్చర్ల గ్రామానికి చెందిన పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు జనసేన పార్టీలో చేరారు.
జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. పెడన నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్తలు లింగం నాగేశ్వరరావు, వికృతి శ్రీనివాస్ బాబు, అంకెం లక్ష్మీ శ్రీనివాస్ సమక్షంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా చిల్లి మోహనరావు, చిల్లి నాగబాల తదితరులకు జనసేన పార్టీ కండువాలు కప్పి నాయకులు పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలని, రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని లింగం నాగేశ్వరరావు, వికృతి శ్రీనివాస్ బాబు, అంకెం లక్ష్మీ శ్రీనివాస్ సూచించారు.
ఈ కార్యక్రమంలో పెడన ఎంపీపీ చందు అమరేశ్వరరావు, పెడన మండల జనసేన పార్టీ అధ్యక్షుడు ఊచా వెంకయ్య, ముచ్చర్ల మాజీ సర్పంచ్ మోటేపల్లి చిత్తరంజన్, ముచ్చర్ల బ్యాంకు చైర్మన్ మోటేపల్లి సురేష్, బండ్రెడ్డి అంక ఆంజనేయులు, పెడన పట్టణ నాయకుడు కూనపరెడ్డి రంగయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.
