జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: అన్నమయ్య జిల్లా మదనపల్లి టమోటా మార్కెట్ ఎదురుగా ఉన్న జ్యోతి రావు పూలే విగ్రహం వద్ద విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో విద్యాశాఖ అధికారులపై వస్తున్న అవినీతి ఆరోపణలను కప్పిపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ ఉపాధ్యాయ సంఘాలపై జేఏసీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు నరసింహ సర్వేపల్లి, తుమ్మల లవకుమార్, కె. మాధవ్, గంగరాజ్ మాట్లాడుతూ, డీఈఓ ఎలాంటి అవినీతికి పాల్పడలేదంటూ ఎంఈఓలు, కొన్ని ఉపాధ్యాయ సంఘాలు బహిరంగంగా సర్టిఫికెట్లు ఇవ్వడం అత్యంత దారుణమని విమర్శించారు.
ఉపాధ్యాయుల సంక్షేమం కోసం, వారికి రావలసిన బకాయిల కోసం ఎప్పుడూ గొంతెత్తని సంఘాలు, అధికారుల అవినీతిని ప్రశ్నించే విద్యార్థి సంఘాలపై ఎదురుదాడికి దిగడం విచారకరమని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణను గాలికొదిలేసి, వివాదాస్పద అధికారులకు వత్తాసు పలకడం వల్ల ఉపాధ్యాయ వర్గాల్లోనే తీవ్ర చర్చ జరుగుతోందని వారు తెలిపారు. అధికారుల అవినీతి అక్రమాలపై విచారణను అడ్డుకోవాలని చూసే బదులు, వాస్తవాలు వెలికితీసేందుకు సహకరించాలని సూచించారు. ఉపాధ్యాయుల హక్కులు మరియు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పనిచేయాల్సిన సంఘాలు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయో స్పష్టం చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఇప్పటికైనా ఉపాధ్యాయ సంఘాలు అధికారుల పక్షాన నిలవడం మాని, ఉపాధ్యాయుల నిజమైన సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని జేఏసీ హితవు పలికింది. లేనిపక్షంలో డీఈఓ అక్రమాలపై విద్యార్థి సంఘాలతో కలిసి మరింత తీవ్రమైన ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో యూఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆఫ్రిద్, కమలాకర్ నాయుడు, జిల్లా ఉపాధ్యక్షుడు గణేష్ రాయల్, సాయి కుమార్ రెడ్డి, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు తరుణ్, విశాల్, లిఖిత్, ఏఐఎస్‌పీ నాయకులు కిరణ్ కుమార్, ఏపీఏజేఏసీ భార్గవ్ తదితర యువజన సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసనను తెలిపారు.
Slug: annanaya-district-madanapalle-student-protest-teacher-associations
