రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి నారా లోకేష్
- విఘ్నాలు తొలగి ప్రతి ఒక్కరి జీవితాల్లో విజయాలు చేకూరాలి
- గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా కొనసాగింపు: మంత్రి నారా లోకేష్
అమరావతి:
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ రాష్ట్ర ప్రజలకు, యువతకు, కూటమి శ్రేణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ అత్యంత ఇష్టమైన దేవుడు ఆ గణనాథుడని పేర్కొన్నారు. ప్రజల జీవితాల్లోని సమస్త విఘ్నాలను తొలగించి, కార్యసిద్ధిని, విజయాలను ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఎల్ నినో భయాలను, ఆందోళనలను పటాపంచలు చేస్తూ ఆ విఘ్న వినాయకుడు రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలను తీసుకొచ్చాడని సంతోషం వ్యక్తం చేశారు.
ఉత్సవ నిర్వాహకులకు అండగా నిలిచేలా, గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా రాష్ట్రవ్యాప్తంగా గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని అందిస్తున్నామని స్పష్టం చేశారు. నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతా సంప్రదాయబద్ధంగా, భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల నడుమ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
